ఇండియాను ప్రధానంగా వేధిస్తున్న సమస్య నిరుద్యోగం
ప్రభుత్వ శాఖల్లో బంట్రోతు ఉద్యోగానికి ఒక్క పోస్టుకు వేల మంది గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకున్న వైనం మన కళ్ల ముందు కనిపిస్తుంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా బెంగుళూరులో నిరుద్యోగ యువతకు సంబంధించిన మరో శోచనీయ విషయమొకటి వెలుగుచూసింది. బెంగళూరు రైల్వే డివిజన్ తెలుసుకుని నివ్వెరపోయిన నిజమిది. బెంగళూరు రైల్వే డివిజన్ పరిధిలోని 83 రైల్వే స్టేషన్లలో ట్రాక్‌మెన్లుగా పనిచేస్తున్న వారిలో ఎక్కువ మంది బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ చదివిన వారేనన తేలింది. దాదాపు 1200మంది పట్టభద్రులు ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న వారిలో ఉన్నారు. ట్రాక్‌మెన్ ఉద్యోగానికి కావాల్సిన విద్యార్హత పదో తరగతి. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని కొన్ని రైల్వే స్టేషన్లు కూడా బెంగుళూరు డివిజన్ పరిధిలోకే వస్తాయి. కుప్పంలో గ్యాంగ్‌మెన్‌గా విధులు నిర్వర్తిస్తున్న యునస్ భాషాతో ఓ ఆంగ్ల దినపత్రిక రిపోర్టర్ మాట్లాడారు.
భాషా ఉస్మానియాలో ఎంబీఏ పట్టభద్రుడు. బీకామ్ పూర్తవగానే 2007లో ఈ పోస్ట్‌కు దరఖాస్తు పెట్టుకున్నాడు. దరఖాస్తు చేసుకున్న మూడేళ్లకు... అంటే 2010లో పిలుపొచ్చింది. 2012లో రాసిన క్వాలిఫైడ్ ఎగ్జామ్‌లో భాషా ఉత్తీర్ణత సాధించి ఉద్యోగం పొందాడు. ఈ జాబ్ గురించి భాషా మాట్లాడుతూ ఇది చాలా కష్టతరమైన పని అని చెప్పాడు. ఉదయం 7 గంటలకు రైల్వే ట్రాక్స్‌పై పని మొదలవుతుందని భాషా తెలిపాడు. అతనితో పాటు మరో 16 మంది 52 పెనుకొండ నుంచి ధర్మవరం పరిధిలో 52 కిలోమీటర్ల మేర ఉన్న రైల్వే ట్రాక్స్‌పై పనులు చేపట్టాలి. ఏ రోజు ఎక్కడ చేయాల్సొస్తుందో తెలియదు. రైల్వే స్టేషన్‌కు దూరమైతే టిఫిన్లు, భోజనాలు అన్నీ ట్రాక్ పైనే. ఉదయం నుంచి ఒళ్లు గుల్ల చేసుకుంటేనే ఉద్యోగం నిలుస్తుంది. ఇవి ఒక్క ఎంబీఏ చదివిన భాషా కష్టాలే కాదు బెంగళూరు డివిజన్ పరిధిలోని రైల్వే స్టేషన్లలో పనిచేస్తున్న వందల మంది అసంతృప్త పట్టభద్రుల కన్నీటి కథలు. ఇంకా ఎన్ని రఘువరన్ బీటెక్ సినిమాలు వస్తే మన దేశంలో ఈ పరిస్థితి మారుతుందోనని నిరుద్యోగులు నిట్టూరుస్తున్నారు.
Labels:
General Info
No comments:
Post a Comment