2 ఏళ్లలో 5 వేల బడుల్లో డిజిటల్ తరగతులు
డిజిటల్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యసాధనలో భాగంగా సాంకేతికతకు పెద్ద పీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తు తరాలను తదనుగుణంగా తీర్చిదిద్దడానికి తగిన కార్యాచరణ ప్రణాళికలు అమలు చేస్తోంది. అందులో భాగంగా ప్రభుత్వ ఉన్నతపాఠశాలల్లో డిజిటల్ క్లాస్‌రూమ్‌ల (డీసీఆర్) ఏర్పాటుకు సిద్ధమవుతోంది.
రానున్న రెండేళ్లలో రాష్ట్రంలోని ఐదు వేల ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ తరగతులు ఏర్పాటుకానున్నాయి. ఈ ప్రాజెక్టు అమలులో ప్రవాసాంధ్రులనూ భాగస్వామ్యులను చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూడు దశల్లో ఈ పథకం అమలుకు ప్రణాళికను నిర్దేశిస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె.సంధ్యారాణి ఈనెల 5న ఉత్తర్వులు జారీ చేశారు. ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ తరగతుల ఏర్పాటును ఈనెల 15న సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. తొలి దశలో వెయ్యి ఉన్నత పాఠశాలల్లో డీసీఆర్‌లు ప్రారంభించేందుకు విద్యాశాఖాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రవాసాంధ్రుల చేయూత :
రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని పాఠశాలల్లో డిజిటల్ క్లాస్‌రూమ్‌లు ఏర్పాటు చేసినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రవాసాంధ్రుల సహకారంతో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నార్త్ అమెరికాలోని ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతినిధి ద్వారా ఈ పథకాన్ని ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం పద్ధతిలో అమలు చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం 70 శాతం నిధులను కేటాయిస్తుండగా, దాతల ద్వారా మిగిలిన 30 శాతం నిధులను సమీకరించనున్నారు.
మూడు దశల్లో అమలు :
డిజిటల్ తరగతుల నిర్వహణ కోసం ఎంపిక చేసిన ప్రతి ఉన్నత పాఠశాలకు రెండు కంప్యూటర్లు, ఒక ప్రొజెక్టర్, ఒక ప్రింటర్, ఒక వాల్‌మౌంట్ స్ర్కీన్, ఒక యూవీఎస్, ఒక ఎక్స్‌టర్నల్ హార్డ్‌డిస్క్ సరఫరా చేయనున్నారు. ఫేజ్-1 కింద తొలి విడతగా 2,658 ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ తరగతులు ఏర్పాటు చేస్తారు. ఫేజ్-2 కింద 768 పాఠశాలల్లోనూ, తుది విడతగా 1574 పాఠశాలల్లో డిజిటల్ తరగతులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి 300 మంది విద్యార్థులకు ఒక డీసీఆర్ ఏర్పాటు చేయనున్నారు. ఈ పథకం అమలు కోసం ప్రతి జిల్లాకు ఒక కేంద్ర నోడల్ పర్సన్, ఇద్దరు నోడల్ కాంట్రాక్ట్ పర్సన్‌లను నియమించనున్నారు. కంప్యూటర్ బోధకుల నియామకానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంది. ఈలోగా ఆయా పాఠశాలల్లో ఇద్దరు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. వారానికి సబ్జెక్టుకు మూడు గంటలపాటు డిజిటల్ క్లాస్‌రూమ్‌లో తరగతులు నిర్వహించేలా టైమ్‌టేబుల్‌ను మార్చనున్నారు.
ఆడియో-వీడియో పద్ధతిలో బోధన :
డిజిటల్ తరగతుల్లో విద్యార్థులకు ఆడియో-వీడియో పద్ధతిలో బోధన చేయనున్నారు. ఇందుకోసం ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న చోట ఆన్‌లైన్ ద్వారా లక్ష ప్రశ్నలు గల క్వశ్చన్‌బ్యాంక్ అందుబాటులో ఉంచుతారు. ఇంటర్నెట్ లేని పాఠశాలలకు ఎక్స్‌టర్నల్ హార్డ్ డిస్క్ ద్వారా వివిధ సబ్జెక్టులకు సంబంధించిన డిజిటల్ ఈ -కంటెంట్‌ను ప్రీలోడ్ చేస్తారు. ఇందుకోసం పాఠశాల విద్యాశాఖ ‘యుఎ్‌సకెవై.ఇన్’ అనే సంస్థతో ఎంఓయూ కుదుర్చుకుంది. డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ.ఆకాశ్.విద్య వెబ్‌సైట్ ద్వారా సదరు సమాచారాన్ని విద్యార్థులు, ఉపాధ్యాయులు పొందవచ్చు.
Labels:
India Education News
No comments:
Post a Comment