4జీ స్మార్ట్‌ఫోన్.........కేవలం 1000
సాధ్యమైనంత త్వరగా పదికోట్ల మంది వినియోగదారులను జియో పరిథిలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని ప్రకటించిన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ... తాజాగా మరో బంపరాఫర్‌తో ముందుకొచ్చారు. కేవలం 1000 రూపాయలకే అపరిమిత వాయిస్, వీడియో కాలింగ్ సదుపాయంతో 4జీ స్మార్ట్‌ఫోన్ అందించనున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. కేవలం కాల్స్ కోసమే ఫోన్లను వినియోగించే గ్రామీణ, టైర్-III మార్కెట్లలోని వినియోగదారుల మనసు గెలుచుకునేందుకే ఎల్‌టీఈ (వోల్ట్) టెక్నాలజీతో ఫీచర్ ఫోన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు చెబుతున్నారు. ప్రత్యేకించి మొదటిసారి డేటా వినియోగిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని కొత్త ఫోన్లు రూపొందించినట్టు రిలయన్స్ ప్రతినిధి ఒకరు పేనర్కొన్నారు. దేశంలోని మొత్తం వంద కోట్లకు పైగా ఉన్న మొబైల్ ఫోన్ వినియోగదారుల్లో 65 శాతం మంది ఇంకా ఫీచర్ ఫోన్లనే వినియోగిస్తున్నారు. 4జీ స్మార్ట్ ఫోన్ల ధర 3 వేల స్థాయికి దిగివచ్చినప్పటికీ... కాల్ చేయడానికి తప్ప వాటి వల్ల ఉన్న అదనపు ఉపయోగాలు సరిగా తెలియకపోవడం వల్లే స్మార్ట్ ఫోన్ అమ్మకాలు కొన్ని వర్గాలకే పరిమితమయ్యాయి.. ప్రస్తుతం వోల్ట్ టెక్నాలజీతో వాయిస్ కాల్స్ అందిస్తున్న ఏకైక టెలీకాం సంస్థ జియో... గత సెప్టెంబర్ 5న సేవలు ప్రారంభించింది.
ఇప్పటికే దాదాపు 2.5 కోట్ల మంది కస్టమర్లను సంపాదించుకోగలిగింది. దేశంలోని అతిపెద్ద టెల్కో కంపెనీ ఎయిర్‌టెల్‌కి ప్రస్తుతం 26 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. దీంతో ఫీచర్ పోన్లను మాత్రమే వినియోగిస్తున్న వారిని ఆకట్టుకోవడం కీలకమని నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు వోల్ట్ టెక్నాలజీ కేవలం స్మార్ట్ ఫోన్లలోనే పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో వోల్ట్ టెక్నాలజీతో రూ.1000 నుంచి రూ.1500 లోపు ధర ఉండేలా రెండు రకాల ఫీచర్ ఫోన్లను రిలయన్స్ అభివృద్ధి చేస్తోంది. వచ్చే యేడాది జనవరి నుంచి మార్చిలోగా చౌక స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకురావాలని యోచిస్తోంది. ఇవి కూడా స్మార్ట్ ఫోన్లలానే పనిచేస్తాయనీ... ఇంటర్నెట్‌తో డాటా యాక్సిస్‌కు ఉపయోగపడడంతో పాటు, వాయిస్ కాల్స్ కూడా చేసుకోవచ్చునని రిలయన్స్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. కాకపోతే ఇది ఫీచర్ ఫోన్ కాబట్టి టచ్ స్క్రీన్ సదపాయం ఉండదని వెల్లడించారు. ఫ్రీ వాయిస్ కాల్స్, ఇంటర్నెట్ సదుపాయంతో స్మార్ట్ ఫోన్లు వస్తే టెలీకామ్ మార్కెట్లో భారీ ప్రకంపనలు ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.
Labels:
Tech News
No comments:
Post a Comment